విపత్తు నిర్వహణ -చట్టం

విపత్తు-నిర్వచనం:
మానవ దైనందిన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ అధిక ప్రాణనష్టం, ఆస్తినష్టం కలిగించే వైపరీత్య సంఘటనను విపత్తు అంటారు.

National Disaster Management Plan May 2016Major_Disasters_in_India

విపత్తు నిర్వహణ చట్టం-2005 నిర్వచనం
ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ప్రకృతి/ మానవ తప్పిదాల వల్ల/ ప్రమాదవశాత్తు వల్ల/ నిర్లక్ష్యం వల్లగాని తనంతతానుగా కొలుకోలేని విధంగా పెద్ద ఎత్తున ప్రాణనష్టానికి, మానవ జీవితానికి, ఆస్తి విధ్వంసం/ నష్టానికి, పర్యావరణ నష్టానికి కారణమయ్యే ఉపద్రవం/ ప్రమాదం/ దుర్ఘటనలనే విపత్తు అని పిలుస్తారు.
ఐక్యరాజ్యసమితి నిర్వచనం
సమాజపు/ కమ్యూనిటీ సాధారణ నిర్మాణానికి, సాధారణ కార్యకలాపాలను అంతరాయం కలిగిస్తూ అకస్మాత్తుగా/ తీవ్రంగా సంభవించే ఆపదను విపత్త్తు అంటారు.

కేంద్ర హోంమంత్రిత్వశాఖ – నిర్వచనం

సాధారణ జీవితానికి లేదా పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగినప్పుడు ప్రాణాలను/ పర్యావరణాన్ని రక్షించి సంరక్షించడానికి అసాధారణ అత్యవసర చర్యలు అవసరమయ్యే ఉపద్రవ పరిస్థితినే విపత్తు అంటారు.

ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1990వ దశకాన్ని అంతర్జాతీయ, విపత్తు సహజ విపత్తుల కుదింపు దశాబ్దంగా ప్రకటించింది.

– తదనంతరం భారత్‌లో సంభవించిన విపత్తులను అనుసరించి అప్పటి వ్యవసాయ మంత్రిత్వశాఖ కార్యదర్శి జేసీ పంత్ చైర్మన్‌గా విపత్తుల నిర్వహణపై సమగ్ర విధానాన్ని రూపొందించేందుకు అత్యున్నతాధికార కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నిర్ణయం ప్రకారం 2002లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోకి మార్చారు. దీనిననుసరించి భారత్‌లో విపత్తు నిర్వహణకు ఒక అధికార క్రమ నిర్మాణం ఏర్పడింది.
భారత్‌లో విపత్తు నిర్వహణ నిర్మాణం
– విపత్తు నిర్వహణ కోసం జాతీయ స్థాయిలో శాసన నిర్మాణ అవసరాన్ని ప్రధానంగా పేర్కొన్న అన్ని పార్టీల సమావేశం 2005, జనవరి 9న జరిగింది.
– విపత్తు నిర్వహణ బిల్లును రాజ్యసభలో మొదటిసారిగా 2005, మే 11న ప్రవేశపెట్టారు.
విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం..
1. కేంద్రంలో- జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ)ను,
2. రాష్ట్రంలో- రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎస్‌డీఎంఏ)ను,
3. జిల్లా స్థాయిలో- జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (డీడీఎంఏ)ను ఏర్పాటు చేశారు.

రోండో పరిపాలన సంస్కరణల సంఘం సిఫారసుతో
73, 74వ రాజ్యాంగ సవరణలతో పట్టణ, గ్రామీణ స్థాయిలో విపత్తు నిర్వహణ సంస్థలు ఏర్పడ్డాయి.
– గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్‌లలో కార్పొరేషన్ మేయర్ విపత్తు నిర్వహణకు బాధ్యత వహిస్తారు.


కేంద్రస్థాయి సంస్థలు NDMA

జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థను (నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ-ఎన్‌డీఎంఏ) ప్రధానమంత్రి అధ్యక్షతన 2005, మే 30న ఏర్పాటు చేశారు. ఇది 2005, డిసెబర్ 23 నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ చట్టంలోని సెక్షన్ 3(1) ప్రకారం ఎన్‌డీఎంఏను 2006, సెప్టెంబర్ 27న ప్రధాన మంత్రి అధ్యక్షతన మరో 9 మంది సభ్యులతో (నామినేటెడ్) ఏర్పాటు చేశారు. ఈ సభ్యుల్లో ఒకరు వైస్‌చైర్మన్‌గా ఉంటారు. వీరితోపాటు ఒక కార్యదర్శి, ఐదుగురు సంయుక్త కార్యదర్శులు, 10 మంది సంయుక్త అడ్వైజర్లు, డైరెక్టర్లు, 14 మంది అసిస్టెంట్ అడ్వైజర్లు, అండర్ సెక్రటరీలు ఉంటారు.
– ఈ చట్టంలోని సెక్షన్ 7(1) ప్రకారం 12 మంది సభ్యులతో 2007లో ఒక సలహా కమిటీని ఏర్పాటు చేశారు.
– ఎన్‌డీఎంఏకు విధుల నిర్వహణలో సహకరించేందుకు విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 8 కింద జాతీయ కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేశారు.
– దీనికి ఎక్స్ అఫీషియో చైర్‌పర్సన్‌గా హోం శాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు. కేంద్ర ప్రభుత్వంలోని వ్యవసాయ, ఆర్థిక, ఆరోగ్య, విద్యుత్, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ది, తాగునీటి సరఫరా, సాగునీటి వనరులు, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్, రక్షణ, అంతరిక్ష శాఖ, అణుశక్తి మంత్రిత్వ శాఖలు లేదా విభాగాల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఇతర సభ్యులుగా చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఢిఫెన్స్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఉంటారు.

– విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం ఎన్‌ఈసీ (జాతీయ కార్యనిర్వాహక కమిటీ)కి విపత్తు నిర్వహణలోని…
– జాతీయ ప్రణాళిక రూపకల్పన
– జాతీయ విధాన అమలు
– పర్యవేక్షణ మొదలైన వాటికి సమన్వయ సంస్థగా వ్యవహరించే బాధ్యతను ఎన్‌ఈసీకి అప్పగించారు.
– జాతీయ స్థాయిలో విపత్తు నిర్వహణ చట్టం- 2005 ప్రకారం…. జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం (ఎన్‌ఐడీఎం), జాతీయ విపత్తు ప్రతిస్పదన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్)ను ఏర్పాటు చేశారు.

ఎన్‌ఐడీఎం(NIDM)

– నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌గా 2006, అక్టోబర్ 16న మార్చారు.
– విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం ఎన్‌ఐడీఎం చట్టబద్ధమైన సంస్థ. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
– ఈ చట్టంలోని 7వ అధ్యాయం సెక్షన్-2 ప్రకారం ఎన్‌ఐడీఎంకు అసంఖ్యాక బాధ్యతలను అప్పగించారు.

అవి.. 1. శిక్షణ నమూనాలను అభివృద్ధిపరచడం
2. శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం
3. పరిశోధనలు చేపట్టడం
4. డాక్యుమెంటేషన్లను చేపట్టడం
5. సదస్సులు, ఉపన్యాసాలు, సెమినార్లు నిర్వహించడం
6. పుస్తకాలు, పరిశోధనా పత్రాల ప్రచురణ చేపట్టడం
– సెక్షన్ 42(4)లోని నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2007, మే 3న 14 మందితో గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసింది.